Saturday, October 21, 2017

ఉత్తమ వాన కధలు , నా భావాలు

ఉత్తమ వాన కధలు , నా భావాలు
వాన కధల కి ఓ సంకలనం ఏంటి? పైగా దీనికితోడు ఉత్తమ తెలుగు అనే విశేషణం? అనే కుతుహులం ఎక్కువైంది.
ఇంతలో పుస్తకావిష్కరణ కి పిలుపు కూడా వచ్చింది.
నేస్తం సుందరీ నాగమణి(రచయిత్రి), పెద్దమ్మాయి స్వప్న కలిసి వెళ్ళాము.
అక్కడికి చేరుకునే లోపల “వాన కు తడిసిన మట్టి సుగంధంలాంటి జ్ఞాపకాలు తెరలుతెరలుగా గుప్పున వచ్చి మనసుని చుట్టేసాయి.
“చిన్నతనం లో అమ్మమ్మ ఊరి కి వెళ్ళినప్పుడు వచ్చిన వాన చిన్న నాటి జ్ఞాపకాల పరిమళాల ని గుర్తు తెస్తే , డిగ్రీ చదివేటప్పుడు, శాంతినికేతనం లాంటిది మా కాలేజీ అని పైకి అంటూ అబ్బే వట్టి పూరి పాకలు అని లోపల తిట్టుకుంటూ, బెంచిల మీదికి గొంగళిపురుగు లు వస్తున్నాయి అని విసుక్కున్నా, చెట్ల మధ్య నుంచి కురుస్తున్న వానను చూసి ఆనంద పడే బరువు,భాద్యతల లేని అల్లరి వయసు జ్ఞాపకాలు కొన్నయితే, దివిసీమ ఉప్పెనకు ,గాలివానలో నాన్నగారు రైలు పెట్టెలో చిక్కడిపొతే ,ఆ భయంకరమైన కాళరాత్రి జ్ఞాపకం ఇప్పటికీ వణుకు తెప్పించేది గా ఉంటుంది..
సంసారబంధం ఏర్పడిన తరువాత ఇద్దరి పిల్లలలు శ్రీవారి తో స్కూటర్ మీద హైకోర్ట్ నుంచి మదీనా వైపు వస్తుండగా కురిసిన భారీ కుండపోత వానకి, దారి కనపడక నాలా అంచు దగ్గర ఆగిపోయినప్పుడు ఆ నాటి వానలో కొట్టుకు పోయి ఉంటె అనే ప్రశ్న, జీవితం లో మర్చిపోలేని జ్ఞాపకం.”
ఇలా దారంతా అవి ప్రవహిస్తూనే ఉన్నాయి.
వాన కధల పుస్తకం ఆవిష్కరణ జరిగింది. అందులో కధల గురించి ప్రస్తావన చేస్తునప్పుడు. మొదటి కధ పాల గుమ్మి పద్మ రాజు గారి “ గాలి వాన” ఆ మాట వినగానే చటుక్కున నాన్నగారు మెదిలారు ఎందుకంటె ఆ కధ వెనుక కధను గురించి నాన్నగారు ఓ అపురూపమైన జ్ఞాపకం చెప్పారు. నాన్నగారు - ఇంటర్ చదువుతుండగా పాలగుమ్మి పద్మరాజు గారు, వారికి గురువులు. పెద్ద నాన్నగారు పాలగుమ్మి పద్మరాజు గారు ఇరువురు కూడా భీమవరం కాలేజి లో సహద్యాయులు. పక్క పక్క ఇళ్ళలోనే వుండే వారు. బహుశా ఈ సంఘటన బహుశా 1949-50 ల -మధ్య జరిగింది అనుకుంటా. అప్పుడు వచ్చిన అతి పెద్ద గాలివానలో వారు నివసిస్తున్న ఇంటి గోడ కూలి వారి శ్రీమతి గారికి దెబ్బతగలటం తో ఒక ఏడాది పాటు ఆవిడ కోలుకోలేకపోయారు. ఆ గాలివాన ఉదృతం చూసిన ఆయన తనకు కలిగిన ఆ భయంకరమైన అనుభవం నుంచే అక్షరరూపం ఇచ్చారని చెప్పేవారు.
ఈ సంకలనం లో ఇరవయి కధలు మొత్తం . మొదటి కధ తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనమైన కద తో మొదలయి. ఓ సాయంత్రపు అదృష్టం అనే కధ తో ముగుస్తుంది. చివరి కధను సంకలన కర్త అయిన ఖదీర్ బాబు వ్రాసారు. ఓ వర్షం కురిసిన సాయంత్రం నుంచి మరునాడు ఉదయం వరకు జరిగిన జీవితం గురించి అతను అని చెప్పబడే పాత్రధారి యొక్క మనస్థితి ని దృశ్యంగా చూపించారు.
ముందు తరం రాసిన కధల తో పాటు ఈ తరం కధలు కూడా చదువరలను తమ రచ(వా)నా చాతుర్యపు జల్లులలో ముంచెత్తుతారు
నాకెంతో ఇష్టమయిన తిలక్ కధ ‘ఊరి చివరి ఇల్లు, అదో అపూర్వ అనుభవం”
వల వలా కురుస్తోంది, జలజలా కురుస్తోంది వాన, కృష్ణ అంతా చినుకులు ,పులకరింతలు అంటూ తలమునకలుగా తడిపిన ‘రెండు గంగలు’ కధ ఎన్ని సార్లు చదివినా తనివితీరదు . bs రాములు గారి పాలు కధ పెత్తందారి తనం చూపించేదిగా ఉంది , కళ్ళలోంచి వాన కురిపిస్తుంది,
పేగుకాలిన వాసన మరో అద్భుతమైన కధ, శ్రీకాంత్ రాసిన 'నిశ్శబ్దపు పాట ' కథలో నదిలో ప్రయాణించే ఒక కాగితపు పడవ ,కొత్త గా ఉంది , అజయప్రసాద్ రాసిన 'మృగశిర 'కథలో రావిశాస్త్రి 'వర్షం', మహేంద్ర రాసిన 'అతడి పేరు మనిషి', అద్దేపల్లి ప్రభు 'అతడు మనిషి' కథల్లో ని మనుషులు మన చుట్టుపక్కల ఉన్నట్టే ఉంటుంది .సం వే రమేశ్ గారి ‘ఉత్తరపొద్దు’ కధ ఆసక్తి కరంగా ఉంది.
పూడూరి రాజిరెడ్డి కధ ‘నగరం లో వాన’ వచనకవిత్వం లా సాగిపోతుంది. అడవి నేపధ్యం లో సాగిన ‘మృగశిర ‘ కధ, కుప్పిలిపద్మ కధ ‘గోడ’ లో ఒక లాలిత్యం కనిపిస్తుంది. అయితే ఇందులో కొన్ని కధలు మనసుకి హత్తుకునేలా ఉంటె మరికొన్ని తమ వెంట తీసుకొని వెళతాయి.
సంపాదకుడు ఖదీర్ చెప్పినట్లు కళకళ , జలజల మనే ఈ ఉత్తమ తెలుగు వానకధల లోకి గొడుగు తొడుగు లేకుండా వెళ్లి తడిసి ముద్దయి, మళ్ళి మళ్ళి తడవాలని అదేనండి మరో వానకధల సంకలనం కోసం ఎదురు చూస్తూ...
మణి వడ్లమాని

Thursday, April 25, 2013

గెలిచిన మందారం


టీవీ లో  చూపించిన ఒక యదార్ధ సంఘటన ఈ కవితకు ప్రేరణగా తీసుకొని రాసాను.




గెలిచిన మందారం : మణి వడ్లమాని  26/04/2013





అందాలతోటలో విరిసింది ఓ  కన్నెమందారం!
కళ్ళనిండా   మధురస్వప్నాలు ,మదినిండా తీయటి తలపులు
కొంగుల ముడివేసిన జీవనసహచరుడితో  అడుగులోఅడుగు వేసుకుంటూ
కొత్తఆశలతో,కోటికోర్కేలతో  ఆనందంగా మెట్టినింట అడుగుపెట్టింది!
కాని తన ఆశలుఅడియాస లేననీ,జీవితమంతా తోడువస్తాడు అనుకొన్న తనవాడే
కాటేసే కాలసర్పమని, తనుఅడుగుపెట్టిన ఈ కొత్త తోటలో అసలు పూలే లేవని
అన్ని ముళ్ళే వున్నాయని  తెలిసి విస్తుపోయింది ఆ ముగ్ద మందారం!
తను జీవించి వున్నా తన వునికినే లేకుండా చేసినప్పుడు
ఇది అన్యాయమని,అక్రమమని ఆక్రోశించింది ఆ పగిలిన హృదయం
ఇంత పెద్ద లోకంలో తన అస్తిత్వాన్ని గుర్తించే వారేలేరా? అని అలమటించి పోయింది.
ఎవరు తనకి సాయపడరు, తోడుగా రారు అని గ్రహించి గుండె దిటవుచేసుకొని
పట్టుదలతో,దీక్షతో  మొక్కవోని దైర్యంతో తన చిన్నారి చిట్టి మందారమే
తనకు కొండతబలం అని తెలిసికొని కష్టనష్టాలకు ఓర్చుకొంటూ ముందుకు సాగింది
జీవితమంతా పోరాడుతూ ఇన్ని రోజులు ఆ కన్నతల్లి ఒకటే ధ్యేయం తో పెంచింది తన చిన్నారిని
తన చిట్టిమందారం తనలా కాకూడదు చదువుకొని అందరికి వెలుగునిచ్చేవిఙ్ఞాన దీపిక కావాలని
తన తల్లి ఇచ్చిన ఆత్మస్త్యైర్యం తో,తనకాళ్ళమీద నిలబడే శక్తిని సంపాదించి తన కన్నతల్లికి బహుమతిగ
ఆమె కోల్పోయిన వునికిని చట్టం ద్వారసాధించి ఆమె ముందువుంచింది ఆ నవతరపు”మందారం”
తన పడ్డ శ్రమకి,కష్టము వృధా కాలేదని  తనబిడ్డ ఇప్పడు  తనలాంటి ఎంతోమంది కి ఆసరాగా నిలిచిందని
తెలిసి ఆనందం తో మురిసిపోయింది ఆ  “గెలిచిన తల్లిమందారం”!!!

Wednesday, April 10, 2013

విజయనామ సంవత్సర శుభాకాంక్షలు(mani Vadlamani)శిరాకదంబంవారు ప్రచురించిన ఈ నా ఆడియో ఉగాది సందేశం'విజయ వాణి'


మిత్రులందరికీ విజయనామ సంవత్సర శుభాకాంక్షలు

శిరాకదంబంవారు ప్రచురించిన ఈ నా ఆడియో ఉగాది సందేశం'విజయ వాణి' ఈ క్రింది లింక్ లో...

https://sites.google.com/site/siraakadambam/home/02_027

రావమ్మా! రా! విజయ వాసంతలక్ష్మీ !
ఇదే స్వాగతం ! శుభస్వాగతం!
నీ కోసం నీ రాక కోసం ఎదురు చూస్తున్న
ప్రతి ఆకు, ప్రతి కొమ్మ ప్రతి రెమ్మ, హర్షాతిరేకం తో, ఊయలలు ఊగుతున్నాయి !
గున్నమావిళ్ళ చిగుళ్ళు తిన్న కొయిలమ్మలు, తీయగా గళమెత్తి పాడుతున్నాయి !
వసంత శోభతో విరిసిన ప్రతి పువ్వు నూతన కాంతితో, సొగసుల వన్నెలు చిందిస్తున్నాయి !
ఆమని సోయగాల మెరుపులతో వనమంతా, ఇంద్రధనస్సులా మెరిసిపోతోంది !
చిలకమ్మల ముద్దుపలుకుల సన్నాయి పాటలతో, నీకు స్వాగతం పలుకుతున్నాయి !
వాసంత విజయమా! మధుర తరంగ సుమభామినిలా భాసిల్లుతూ, విజయం చేయవమ్మా !
విజయ దుందుభులు మోగిస్తూ, విజయ కేతనం ఎగురవేస్తూ, విజయశంఖారావం పూరిస్తూ
విజయోత్సాహం తో, జగతినంతా చైతన్యం చేస్తూ , రావమ్మా! రా! విజయ వాసంతలక్ష్మీ !
ఈ భవ్య విజయ ఉగాది భావితాశల పునాదీ !
అది సకల జనావళికి తెలుపుతూ దీవెనలు అందజేయవమ్మా !

Wednesday, April 3, 2013

నా కధ 'అర్ధనారీశ్వరం' ఆంధ్రభూమి ఏప్రిల్ మాస పత్రిక లో .......ధన్యవాదాలు....మణి వడ్లమాని

ఆంధ్రభూమి ఏప్రిల్ మాస పత్రికలో 53 va page lo

(April- 13) నా కధ 'అర్ధనారీశ్వరం' ప్రచురించారు. చదివి మీ అభిప్రాయం తెలుపుగలరు 





Thursday, March 14, 2013

ఉషోదయం!







  
ఉదయభానుడి లేలేత కిరణాల స్పర్శ నును వెచ్చగా తాకుతోంది
 అప్పడే విచ్చిన ఎఱ్ఱని మందారం తూర్పుదిక్కు తో పోటిపడుతోంది
 జగతినంతా మేలుకొలుపుతూ ఆకాశం ఉదయరాగం  పాడుతోంది
 మంచు మేలిముసుగు తొలగించి ప్రకృతి ఆకుపచ్చని చీరచుట్టింది
    పక్షులు కిలకిలతో కోయిల కుహుకుహులతో భూపాలరాగం జతకట్టింది
  ఉషోదయం, ఉషోదయం సమస్త జగతి కి శుభోదయం, శుభోదయం!!

Sunday, March 3, 2013

విరిసిన మందారం!!








పూచింది పూచింది ఆ తోటలోన జంటమందారం
ఆకాశంలోని సూర్యబింబం తో పోటి పడుతూ ఎర్రమందారం
సిగ్గుతో ఎరుపెక్కిన చెక్కిళ్ళతో పదహారేళ్ళపడచు కన్నెమందారం
ప్రియుని ఆగమనం కోసం వేచి వున్న ముగ్ధమందారం 
ఉదయరాగం ఆలపిస్తూ,కనువిందు చేసే సోయగాలపరువపు మందారం
పచ్చటి ఆకులమధ్య విచ్చిన కన్నుల తో కోటిఆశల నడుమ విరిసిన మందారం!!