Saturday, October 23, 2021

దృశ్యా దృశ్యం
నిత్యకృత్యాలు జరిగిపోతున్నాయి. మధ్యాహ్నం గడిచి, సాయంత్రంలోకి నడిచి, రాత్రి లోకి వెళుతూ రోజు భయంగా నా వైపు చూసింది. నేను రేపనేది చూడనని దానికీ తెలిసిందేమో. తప్పదని తెలిసి కళ్ళు మూసుకుని భయపడసాగింది. ​ భయం. భయం. భయం. ​ సందడి లేకపోవడం, దిగులుతో పాటు, ఇల్లు వీధులు కూడా నిశ్శబ్దంగా ఉండటంతో తెలియని, గుబులు. రేపు అన్నది ఇంక నా జీవితంలో ఉండదు. జీవించి ఉంటే, మళ్ళీ మళ్ళీ దాన్నే చూడాలి. అది వద్దు. చాలు ఈ జీవితం. ​ హమ్మయ్య! ఇంకెంత సేపు? మహా అయితే ఒక ఇరవయి నిముషాలు. ఆ తరువాత అంతా ప్రశాంతతే. ​ నాకు ఇష్టమయిన పాట .. “ఆప్ కీ యాద్ ఆతీ రహీ రాత్ భర్”. ఆ... గొంతులో విషాదం వింటూ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవాలి. అదే నా ఆఖరి కోరిక. సెల్ ఫోన్ అదే పనిగా మోగుతుంటే శాస్త్రి గారి కవితలో ఒక పదం మార్చుకుని 'మనసారా చావనీయరు” అనుకుంటూ లేచి వెళ్లి ఫోన్ తీసా... ‘నేను పంపిన మెసేజ్ ని చూడు అంటూ రాజు గాడి నుంచి ఫోన్. ఆ మాట చెప్పేసిన మరుక్షణంలో ఆ వైపు నుంచి ఫోన్ కట్ అయింది. చావు కన్నా కుతూహలం ఇంకా పవర్ ఫుల్ లా ఉందే? అదేమిటో చూడమని మనసు ఆత్రుత పెడుతోంది. కొంత సేపు ఈ లోకం నుంచి వీడ్కోలు తీసుకునే కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేశాను. ఫోన్ తీసి మెసేజ్ చూసాను. అందులో ఇలా “ఈ లింక్ ఓపెన్ చేసే ముందు ఇది చదువు. ఒక ఫోన్ నెంబర్, మెయిల్ id ఉన్నాయి . ఇందులో వాళ్ళిచ్చిన వివరాల ప్రకారం చూస్తే ముందర మెంబెర్స్ గా చేసుకుంటారు. అయితే ఎవరైనా రాయవలిసిన అనుభవాలు మాత్రం వాళ్ళిచ్చిన మెయిల్ ఐడికి మాత్రమే పంపాలి. వాటిని వాళ్ళు పేరు మెయిల్ ఐడి, ఫోన్ కూడా లేకుండా, మేటర్ ఒక్కటే పబ్లిష్ చేస్తారు. దానికి కూడా టైమింగ్స్ ఉన్నాయి. అవన్నీ గ్రూప్ నిబంధనలు. అందుకు సమ్మతమయిన వాళ్లనే కొనసాగించనిస్తారు. ఏమాత్రం విరుద్ధంగా అనిపించినా వెంటనే గ్రూప్ నుంచి తొలగిస్తారు. అందుకు ఇష్టమయిన వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వాలి. అంతేకాదు ఈ గ్రూప్ లో అడ్మిన్స్ తప్ప వేరెవరు పోస్ట్ చెయ్యరు/చెయ్యలేరు. ఇందులో బాధలే కాదు, సలహాలు, పరిష్కారాలు కూడా ఇయ్యవచ్చు. అవతలి వాళ్ళ బాధ, ప్రాబ్లంకి నువ్వే పరిష్కారం ఇవ్వొచ్చేమో? నీకు ఇలాంటివి ఇష్టమే కదా! అందుకే నీకు పంపిస్తున్నాను. నాకు తెలిసి ఇది కొంతమంది NGOలు చేస్తున్నట్లున్నారు. నీకు ఈ పాటికే అర్ధమయిందనుకుంటాను. దేనిగురించో ? అదే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికీ కంటికి కనిపించని భయంకరమైన శత్రువు అయిన కరోనా గురించి అని”. ఇంటరెస్టింగ్ గా ఉందే! అనుకుంటూ వాడు చెప్పినట్లు చేశాను. వెంటనే. ఆడ్ అయినట్లు నోటిఫికేషన్ వచ్చింది. ఎప్పుడయితే గ్రూప్ లో కలుపుకున్నారో వెంటనే అందులో ఉన్న పోస్ట్ చూడగలిగాను. అది ఆ రోజు పోస్ట్ చేసిన అనుభవం.కేవలం కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఎవరు రాసారో తెలిసే అవకాశం లేదు. కళ్ళు అక్షరాలను వెంబడించాయి. దృశ్యాలు దృశ్యాలుగా కథలు కనిపిస్తున్నాయి * * * దృశ్యం 1 “నీ టెస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. "కరోనా" అని తేలింది. నువ్వు ధైర్యంగానే ఉన్నావు. కానీ, నాకే భయం పట్టుకుంది. నన్ను క్షమించు, నా ప్రవర్తనకు నేనే సిగ్గు పడుతున్నాను. నీకు పోసిటివ్ అని తెలిసినప్పుడు నీ పట్ల నేను చూపిన నిరాదరణ. నీ వ్యక్తిత్వం ముందు నే మరుగుజ్జునయ్యాను. నీ కళ్ళలో మటుకు అదే ఆరాధన అదే ప్రేమ అభిమానాలు కనిపించాయి. నా బలహీనతను చూసి నవ్వుకున్నావా? నిజమే, మానసికంగా నువ్వు దృఢంగా ఉన్నావు. జీవితాన్ని చాలా ప్రాక్టికల్ గా తీసుకున్నావు. భయపడితే ఆగేది ఏది లేదని తెలుసు. అయినా ఉష్ట్రపక్షి లాంటి మనస్తత్వం నాది. అందరి ఉండగా పెద్ద ధైర్య వంతుడిలా పోజ్ కొట్టే నేను. ఒక్కడిని ఉన్నప్పుడు మటుకు చాల భయపడతాను. నిజానికి పైకి కనిపించేది డాంబికం లోపల వట్టి డొల్ల. అది ఈ ప్రపంచానికి శాశ్వతంగా దూరం అవుతాం అనే దానికన్నా, పక్కనున్న మన మనిషి మనవాళ్ళు అనుకునే వాళ్లు చేసే దూరం భరించలేనిది అని తెలిసి కూడా నీకు ఒక మాట నేనున్నాను అని, ఏం పర్వాలేదు అని చెప్పలేకపోయాను. ఎక్కడ నీ మాట విన్నా కూడా అంటుకు పోతుందేమో అనే ఆలోచన నన్ను వదల లేదు. నీకు తగ్గి ఇంటికి వచ్చాక నీ కళ్ళలోకి చూసే శక్తి, ధైర్యం లేకపోయింది. అయినా వాటినిండా కనిపించే దయ, కరుణ నన్ను విచలితుడిని చేస్తున్నాయి. అది తట్టుకోలేకపోతున్నాను. శక్తిని కోల్పోతున్నాను. నన్ను క్షమించు. చావే దూరం చేయాలి కాని బతికి ఉండగా ఏ బంధంలోనూ దూరం పెంచుకోగూడదు. ఇదే నేను తెలుసుకున్న సత్యం” ఇది ఓ భర్త అంతరంగం అని ఉంది. ​ ఫోన్ పక్కన పెట్టాను. ​ హు! భలే మనిషిలా ఉన్నాడే, అయినా అందరిలో ఎన్నోన్నో కబుర్లు చెప్పే ఆ భర్త ఒంటరిగా ఉంటే మహ భయస్తుడు, ఆలోచించటానికి భయపడే భీరువు అని ఊరికే అనలేదు. అదే తనకి వచ్చి ఉంటే భార్య అతన్ని ఇలాగే ట్రీట్ చేసేదా? హు.స్వార్ధం. కరడుకట్టిన స్వార్ధం. అవునూ? అరె! అదేంటి? నేను పోవాలి కదా! మధ్యలో ఈ పిట్ట కథలేంటి? ​ ఛ... ఛ... అలా అనుకోకూడదు. అవి కథలు కాదు. మానసిక వ్యధలు! ​ మనసు ద్వైదీభావంతో ఊగిసలాడింది. ​ నిజమే మరి నువ్వు చచ్చిపోదామని డిసైడ్ అయ్యావు కదా? మనసు ప్రశ్న వేసింది. ​ అవుననుకో అవి చదివేసాక ... అని జవాబు అదే ఇచ్చింది. ​ ఆ పక్కనే టెస్ట్ రిజల్ట్ కవర్ లోంచి రిపోర్ట్ గాలికి ఎగురుతోంది. ​ ఎదురుగా ఉన్న గడియారం లో పెద్దముల్లు చిన్నముల్లు వాటిపని చేసుకుపోతున్నాయి. ​ *** దృశ్యం-2 ఇదో వ్యథ. సారీ! కథ. అనాలి కాబోలు. ​ “The battle has just begun. You tell me I'm not the only one” ​ నిజం కదా! ​ లేకపోతే ఎంతో ఆనందంగా సాగవలసిన ఈ జీవితం ఇప్పుడే ఓ సమస్యతో, కాస్త సందిగ్ధతతో మొదలు కాబోతోందా? అన్ని అయ్యాకా శుభలేఖలు అచ్చు వేసాక అమ్మా, నాన్నా పోనీలే బ్రేక్ చేసేద్దాము ఈ సంబంధం అంటారేమిటి? అతను డాక్టర్, రోజు కొన్ని వేలమందికి ప్రాణాలు పోస్తున్నాడు. ఎవరో పాజిటివ్ పేషెంట్ల ద్వారానే ఇతనికి వైరస్ సోకినట్లు తెలిసింది. అందుకు అతను నన్ను కలవడానికి రావద్దని చెప్పేసాడు. పెళ్ళికూడా వాయిదా వేసాడు. దీంతో అమ్మ వాళ్ళు ఓ నిర్ణయానికి వచ్చేసారు. కానీ నాకు అది చాల తప్పుగా అనిపించింది. అతను యెంత డాక్టర్ అయినప్పటికి లోలోపల ఎక్కడో తెలియని చిన్న భయం అనేది ఉంటుంది. ఒక మనిషిగా అతనికి నేనున్నాను అనే కాన్ఫిడెన్సు ఇవ్వడం కనీస ధర్మం. అలాంటి అతన్ని కష్టపెట్టటం నా వల్ల కాదు. అతను రోజూ తనతో మాట్లాడందే ఉండలేడే? నాకు మమ్మీ డాడీల ఆలోచన అస్సలు నచ్చలేదు. అసలు అంత ఘోరంగా ఎలా అనుకుంటున్నారు” అని తల్లి తండ్రుల ప్రవర్తన గురించి రాసుకుంది. ​ చదవడం ఆపి ..ఒక్కక్షణం ఆలోచించాను. ఇది రాసింది ఒక అమ్మాయి అని తెలుస్తోంది. కళ్ళముందు ఓ రూపాన్ని నిలిపే ప్రయత్నం చేశాను.అబ్బే.. కుదరటం లేదు. అస్పష్టమైన ఆ రూపం చెదిరిపోతోంది. ​ వెంటనే లేఖ గుర్తుకి వచ్చి మనసంతా హాయిగా నిండిపోయింది. ​ పత్రలేఖ... ఇలాగే ఆలోచిస్తుందా? నా సంగతి తెలిసింది కదా. అసలు తన ఆలోచనల లోపల రూపం ఎలా ఉంటుందో? పైకి కనిపించేదే నిజమని ఎలా నమ్మగలం. ​ అందుకే ఊరికే అవతల వాళ్ళని అంచనా వేసేసి జడ్జిమెంటల్ అయిపోకూడదు. ​ ఇక నా ఆలోచనలకి అడ్డుకట్ట వేసి చదవడం కొనసాగించాను. ​ *** ​ దృశ్యం-3 ఓ వలసకూలి తల్లి చెప్పిన తనకి చెప్పిన కన్నీటి కథని ఓ జర్నలిస్టు, ఆ తల్లి మాటల్లోనే పంపాడట. పోస్ట్ చేసారు. ​ “పట్నం నుంచి తిరిగి వచ్చిన పోలాయి నీరసంతో అలిసిపోయి మంచాన పడ్డాడు . ​ వాడు అలా దగ్గుతూ, నీరసంగా పడుంటే నూకాలుకి బాధ వేసింది. పైగా వాడిని అలా కుక్కి మంచంలో చూస్తుంటే, వాడి తండ్రి పడుకున్న తీరే గుర్తుకు వస్తోంది. ఆ తరువాత ఆడు పోయాడు కూడా. ​ అప్పుడు ఆడిది అంటే ముసలి ప్రాణం, వీడు చిన్నపిల్లాడే కందా ఏదో పట్నం పోయి నాలుగు డబ్బులు సంపాదించి తెద్దామని వెళ్ళాడు. ​ పైడితల్లి సంపాదన అంతా వాడి తాగుడికే సరిపోతుంది. నూకాలు కేమో ఉబ్బసం, ఆయాసంతో దగ్గి దగ్గి ఊపిరి ఆగిపోయేటట్లు ఉంటుంది. ​ వెళ్ళిన రెండు నెలలకే ఫోన్ చేసి, అమ్మా అందరు ఊరుకి పోతున్నారే నేను కూడా వచ్చేస్తాను అని చెప్పినాడు. ఎవరో ధర్మాత్ముల పుణ్యమా అని ఇరవయి రోజుల తరువాత గాని చేరుకోలేకపోయాడు. దారిలో నానా కష్టాలు పడి వచ్చాడు. వచ్చిన కాడి నుంచి దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడు. ​ అప్పట్లో అందరూ ఇక్కడ నుంచి పొలోమని కాంట్రాక్టు కూలీలుగా ఆ పెద్ద పట్నం పోయారు. వద్దన్నా వినకుండా పోయాడు. ఆ బిల్డింగ్స్ కట్టేకాడ బోలెడు పని ఉంటుంది. డబ్బులు బాగా వస్తాయి అనుకున్నాడు. తీరా అక్కడ బోలెడు పని చేయించి, డబ్బులు ఈయాల్సిన టయానికి, పోలాయిని తీసుకెళ్ళిన కాంట్రాక్టర్ వీడికి వచ్చే జీతంలో మూడొంతులు తీసేసుకునే వాడు. పైగా అలా ఎందుకు చేస్తున్నావని అడిగితే ! దొంగ నాకొడకా! నేను గానీ ఈ పని చూపించక పొతే పస్తులుండేవాడివిరా, అంటూ నానా బూతులు తిట్టి డబ్బులు లాక్కునేవాడు. ​ అంతలో ఈ మాయదారి రోగం మహమ్మారి లా వచ్చి మా నోళ్ళు , కడుపు కొట్టేసినాది ఇక అక్కడ పనిలేక పోయే, డబ్బు లేక పోయే, తిండికి కూడా కరువచ్చే పడే, అందుకే విడిచి పెట్టమని వాళ్ళని బతిమాలి బతి మాలి నడుచుకుంటూ వచ్చేసాడు ఆ రావడంలో చాల కష్టాలు పడ్డాడు. పిల్లడు యెంత దుఃఖ పడ్డాడో? ఆ దేవుడికే ఎరుక. ​ “అమ్మా! నేను ఇంకా పట్నం పోనే పోను. ఇక్కడే పని చేస్తా” అని ఏడిచాడు. ​ ఇది ఇంకా ఘోరం. ​ చదువుతున్న నా గుండె చెరువయి పోయింది. ​ కళ్ళు చెమర్చాయి. చప్పున కళ్ళు తుడుచుకున్నాను.ఈ మధ్యనే వలస కూలీల మీద రాసిన ఒక పాట గుర్తొచ్చింది. ​ *** ​ మెలకువ వచ్చింది. క్షణ కాలం ఎక్కడున్నానో తెలియలేదు. చెయ్యి చాచి సెల్ అందుకున్నాను. టైం ఐదున్నర అవుతోంది. కొంతసేపు ఆగి మంచం మీద నుంచి లేచాను. బయట అంతా నిశ్శబ్దంగా ఉంది. అందులో మాది గేటేడ్ కమ్యూనిటీ కావటం వల్ల పెద్దగా శబ్దాలు ఉండవు. నా ఫ్లాట్ ఆరవ అంతస్తులో ఉండటం వల్ల బయట రోడ్, దానికి అనుకున్న పార్క్ కనిపిస్తున్నాయి. అక్కడ చెట్లమీద నుంచి వినిపించే పక్షుల కిలకిల రావాలు, గుత్తులుగుత్తులుగా పూసిన ఎరుపు, పసుపు రంగుల తురాయి పూలు, ఆ పూలు కింద పడి పసుపు కుంకుమలతో అందమైన ముగ్గుపెట్టినట్లుగ ఉంది. ఈ ఫ్లాట్ ఆఫీస్ కోసం పెట్టుకున్నది, దానికి తగ్గట్టుగా అన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నది. ఇది గో ఇలా పనికి వచ్చింది. ​ శకలాలు గా వచ్చిన ఆ కలని గుర్తుకు తెచ్చుకున్నాను. అబ్బ యెంత దీర్ఘంగా ఉంది. తను చనిపోవాలని అనుకోవడం? తలుచుకుంటే నవ్వు వస్తోంది. బట్… అసలు ఆ ఆలోచనే తనలోలేదు అయినా కలలో వచ్చింది. కలలో మా రాజు నుంచి మెసేజ్ రావటం, దాని మూలాన కొంతమంది జీవిత కథలు తెలుసుకోవడం, తలచుకుంటే భలే వింతగా ఉంది. ​ నిజానికి కరోన పాజిటివ్ వచ్చిందని తెలిసి హోం క్వారంటైన్ లోనే ఉంటున్నాను... రాత్రి ఆఫీస్ పని వత్తిడితో చాల అలిసిపోయి తెలియకుండానే నిద్రలోకి జారుకున్నాను. సబ్ కాన్షస్ లో తుట్టలా ఉన్న భావాలన్నీ ఇలా వరుసపెట్టి దృశ్యాదృశ్యంగా అదీ ఓ దీర్ఘకల రూపంలో రావడం విచిత్రంగా ఉంది. వయసు మళ్ళిన భర్త స్వగతం, ఆ తరువాత పెళ్లి చేసుకోబోయే యువతి సంఘర్షణ, ఆ తరువాత వలస కూలీ తల్లి బాధ కూడా ఇంకా కళ్ళ ముందే ఉన్నాయి. ఇవన్నీ కల అంటే నమ్మబుద్ది కావటం లేదు. కానీ అవి ఎందుకు యదార్ధంగా అనిపిస్తున్నాయి? కానీ ఒక్కటి అర్ధం కాలేదు కల అయినంత మాత్రాన అది నిజమని నమ్మకూడదా! అంటే మెదడులో నరాల పొరల అరల్లో దాగిన ఆలోచన శకలాలే ఇలా కలలుగా రూపాంతరం చెందుతాయా? సుప్తచేతనావస్థలో మెదడు తనలో దాచుకున్న వాటిని బయటకు తీస్తుందా ? ఏమో? ​ మొన్న టీవీ లో చూసిన ఓ సంఘటన, ఓ ముప్పయేళ్ళ యువకుడి కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిసి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం, మరో కథలో ఓ భార్యకి కరోనాసోకితే ఇంట్లో వాళ్ళే దూరం పెట్టేయడం అన్నిటికంటే ఓ తల్లి పడే మనోవేదన ఇవన్నీకలిపి నాకు తెలియకుండానే బయటకు వచ్చాయా ? అబ్బ యెంత దీర్ఘంగా ఉంది. ​ ఇంతలో ఫోన్ మోగింది. పత్రలేఖ ఫోన్ చేసింది. “లేచారా ? ఆరవ్ మాట్లాడుతాడట” అని వాడికి ఇచ్చింది. “డాడీ ఎలా ఉన్నావు ? ఎప్పుడు వస్తావు టూర్ నుంచి అని” అడిగాడు ఆ చిన్ని బుర్రలో అన్ని ప్రశ్నలే ? వాడికి నచ్చ చెప్పి “మమ్మీకి ఇయ్యి” అన్నాను. అప్పుడు చెప్పాను లేఖకు రాత్రి వచ్చిన కల గురించి? అంతా విని “ఎక్కువ ఆలోచించకు ప్లీజ్” అంది. తన భయాలు, తన కన్సర్న్, ప్రేమ, అభిమానం అన్నీ ఆ చిన్న మాటలో ఇమిడిపోయాయి. “అలాగే లేఖా, నో వర్రీస్, ఐ యామ్ ఆల్రైట్” అని చెప్పేంత వరకు వదలలేదు. ​ ఫోన్ పెట్టేసి కిచెన్ లోకి వెళ్లి కాఫీ కలుపుకుని తెచ్చుకున్నాను. తాగుతూ ఫోన్ తీసి చూస్తున్నాను. నిజంగా నేను అదృష్టవంతుడినే. కరోనా కేవ‌లం మ‌నుషుల‌నే కాదు. మాన‌వ‌త్వాన్ని కూడా చంపేస్తోంది. బంధాలు, అనుబంధాలు, స్నేహాలు క‌రోనా ముందు క‌కావిక‌ల‌మ‌వుతున్నాయి. అన్నీ బాగుంటేనే అందరూ... ప్రాణాల మీద‌కు వ‌స్తుంద‌నుకుంటే ఏ ఒక్క‌రూ మిగ‌ల‌రే అనే న‌గ్న స‌త్యాన్ని క‌రోనా నిరూపిస్తోంది. ​ వంద‌లాది మంది ఆప్తులు, బంధువులు, స్నేహితులు ఉన్న‌ప్ప‌టికీ... ఎవ‌రూ లేని అనాథ‌లా మిగిలిపోతు న్నామా ? ఏమో? అవే ఇలా కలలరూపం లో వచ్చాయా ? ఆలోచనలో ముణిగిపోయిన నాకు ఫోన్ మోగటంతో తీసి చూసాను. రాజు దగ్గర్ నుంచి “గుడ్ మార్నింగ్ రా శేఖరా. ఎలా ఉన్నావు ఇంకెంత ఇంకో ఆరు రోజులు. హ్యాపీ గా వచ్చేస్తావు. ఓపిక పట్టు. బై ది వే నేను పంపిన మెసేజ్ చూడు దాని గురించి వివరాలు అన్ని అందులో ఉన్నాయి. నీకు ఇలాంటివి ఇష్టమే కదా! అందుకే నీకు పంపిస్తున్నాను. నాకు తెలిసి ఇది కొంతమంది NGOలు చేస్తున్నట్లున్నారు అని ఫోన్ పెట్టేసాడు. ​ దాదాపు ఇవే మాటలు కదా రాత్రి కలలో వినిపించాయి? ఆశ్చర్యం వేసింది. ​ ఆత్రుతగా మెసేజ్ ఏమి పంపించాడో అనుకుంటూ ఓపెన్ చేసి చూసాను. ​ విభ్రాంతి, విస్మయం కలిగాయి. ఈ ప్రపంచంలో లాజిక్‌ అందని కొన్ని సంగతులు జరుగుతూనే ఉంటాయని నమ్మాల్సి వచ్చింది. ​ ఇంతకూ రాజు పంపిన మెసేజ్లో ఉన్నది, నిన్నరాత్రి నా కలలో వచ్చిన మెసేజ్ ఒకటే! ఆ వాట్సప్ గ్రూప్.. డీటెయిల్స్… అన్నీ… అన్నీ... అవే... అవే… అచ్చుగుద్దినట్లుగా! ​ ఆ పోస్టుల్లోని వ్యధల్లో కథలు సైతం సరిగ్గా రాత్రి కలలో చూసిన దృశ్యాలే అవటం మాత్రం నాకు పెద్దగా ఆశ్చర్యాన్ని కలిగించలేదు. ఎందుకంటే, ఆ పోస్టుల్లో ఉన్నవి ఎన్నో వేల వ్యధలు. నేను చూసినవి మూడేగా? ​ *****

Saturday, January 18, 2020

ప్రయాణం ధారావాహిక రెండవ భాగం



"సత్యా  మటుకు  గాజుపెట్టలో... దీర్ఘ నిద్రపోతున్నాడు. ...... సత్యానికి  మరణం లేదుకదా... నువ్వు  ఉండి లేవా. ..... లేకుండా .... ఉన్నావా రోజు నుంచి   నా అనే నువ్వు ఉండవు. నాలోని నీ జ్ఞాపకం పలుచగా, వెలిసిపోయి ఇంకిపోతూ ఉంటె...అది నే భరించలేను." ...చదవండి  మరి 








Monday, January 13, 2020

ప్రయాణం ధారావాహిక మొదటి భాగం






"
నీతో గడిపిన కాలం యెంత బావుండేది, ఎన్నెన్ని వాదనలు జరపుకునే వాళ్ళము. విషాదాన్ని మోసి  అలసిన మనసుకి నీ జ్ఞాపకాలే  ఊరట”   అనుకున్నాడు
"........కాని అపరిచిత  వ్యక్తి.. ఎందుకో  తన మనసుని పట్టి  పైకి లాగుతున్నట్లుగా .. ఇక్కడ  అద్భుతమైన ప్రదేశంలో తనలాగే, ఇంతమందిలో ఏకాంతంగా....తన దారిలో ....తనలోని నేను, అతనిలోని నేను ఒకటేనా" ..మయూఖ అతనినే చూస్తూ అనుకుంది.

......... ప్రయాణం ధారావాహిక ..ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధం లో

https://epaper.prabhanews.com/2508644/Sunday/12-01-2020-sunday#page/19/1
https://epaper.prabhanews.com/2508644/Sunday/12-01-2020-sunday#page/20/1
https://epaper.prabhanews.com/2508644/Sunday/12-01-2020-sunday#page/21/1

Tuesday, January 7, 2020

మేనిక్విన్ (Mannequin)

మేనిక్విన్ (Mannequin)
అది నగరం లో మహా రద్దీగా ఉండే ప్రాంతం. ఆ రోడ్డు మొత్తం  పెద్ద పెద్ద బట్టల షాప్ లు హోటల్స్ ఉండటంతో రోజంతా హడావుడి గానే  ఉంటుంది. వచ్చే పోయే బస్సులు, కార్లు,ఆటొలు,మోటారుసైకిళ్ళు తో మోతెత్తి  పోతూంటూంది. క్రమంగా పొద్దు గడచి రాత్రి కావటం తో నెమ్మదినెమ్మదిగా నిశబ్ధం  కొండచిలువలా ఆక్రమించుకుంటోంది . అప్పటికే కొన్ని షాపులు మూసేసారు .కొంతమంది షట్టర్స్ వేసేసి లోపల పని చేసుకుంటున్నారు.
ఆ వరుస లో ఉన్న ఒక పెద్ద షాప్ లోపల ఓ ముసలతను, మరో నలుగురు కుర్రాళ్ళు, ఇద్దరు అమ్మాయిలుఉన్నారు. వాళ్ళు పనిచేస్తూ  మద్య మధ్యలో ఆ ముసలతన్ని అల్లరి పెడుతున్నారు. అతను కోపంగా వాళ్ళను అదిలిస్తున్నాడు. కొంచెం సేపటికి అదికాస్తా శ్రుతి మించింది. అతను కోపంతో వణికిపోతూ  గట్టిగా అరిచాడు, “నా కొడకల్లారా అక్కడ చెయ్యి వేసారంటే చంపేస్తాను”. ఆ మాటలు వింటున్న ఆడపిల్ల లిద్దరూ ఆ కుర్రాళ్ళని కేకలేసి, “తాతా నువ్వు ఎందుకు అరుస్తావు, వాళ్ళు ఊరికినే నిన్ను ఉడికిస్తున్నారు” అంటూ అతన్ని  శాంత పరిచారు.
కొంత సేపయ్యాక  ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
**
మొబైల్ రింగ్ అవుతోంది, టీవీ చూస్తున్న చైతాలీ సౌండ్ తగ్గించి ఎవరి దగ్గరనుంచా అని చూసింది అది సీమా నుండి వచ్చింది. వెంటనే  ఆన్సర్ బటన్ ప్రెస్ చేసి “హాయి సీమ,గుడ్ మార్నింగ్,పొద్దున్నేకాల్ చేసావు ఏంటి విశేషం”,అంది                                                                                                           
అవతలనుంచి సీమ “ అరె చైతూ !  అదే ఇవాళ మన కు లంచ్ పార్టీ ఉంది  మర్చిపోలేదు కదా ? అదికాక డ్రెస్ కోడ్  మారింది, అది చెబుదామని కాల్ చేశాను నేను పెట్టిన మెసేజ్ స్  ఏది చూడలేదని అర్దమయింది. మనం ముందు అనుకున్న యెల్లో బదులు లెమన్ యెల్లో  కలర్ శారీస్ కట్టుకుందామని డిసైడ్ అయ్యాము.” అంది.                                                                                                                 ఆ మాటలకి చైతాలీ వెంటనే “అరె, ఎందుకు అలా మార్చేసారు, కష్టం కదా, ముందు ఒకటి అనుకోని ఇప్పుడు మళ్ళి లెమన్ యెల్లో అంటే ఎలా? అయినా నా దగ్గర ఆ కలర్ లేదు.” అని గట్టిగానే అంది. 
నిజానికి ఆమెకి కోపం వచ్చింది. కానీ బావుండదని తమాయించుకుంది.                                                                                                                                “అయ్యో అందరికి మెసేజ్ పంపేశాను, చైతూ, ప్లీజ్ ప్లీజ్ నువ్వే ఎలాగో అలా మేనేజ్ చేసుకో, షార్ప్ పన్నెండుగంటల కల్లా, వచ్చేయి,ఇక ఉండనా! అంటూ చైతాలీని మా రు మాట్లాడనీకుండా ఫోన్ పెట్టేసింది సీమ.  
‘హు! ఆ గంప గయ్యాళి,  సుష్మా మార్చేసుంటుంది. అది ఏమంటే ఈ సీమా  వెంటనే ఓకే ఓకే అనేస్తుంది’ .అని లోలోపల ఉడికిపోతోంది. కానీ చేసేదేమీ లేక బెడ్ రూమ్ లో ఉన్న వార్డ్ రోబ్ తెరచి చూసింది. లెమన్ ఎల్లో చీర ఉంది కాని అది పాత గా ఉంది.అయినా అటు ఇటు తిప్పి చూసింది. ‘హుహు   బావులేదు” అనుకుంది. ఎందుకైనా 
మంచిదని కూతురు తూలిక  రూమ్ లోకి వెళ్లి అడిగింది. అది చూస్తూనే  ‘ఏంటి మమ్మీ ఈ చీర అస్సలు బాలేదు కొత్త చీర కొనుక్కో’ అని  ఓ చక్కటి సలహా కూడా ఇచ్చింది. అప్పుడు మొదలయింది చైతాలీ లో ఆలోచన. అవును కదా కొత్త చీర కొనుక్కుంటాను. షాప్ లు  పది గంటలకల్లా తీస్తారు. ఎలాగూ ఇంట్లో ఉండే శోభ తొందరగా ఫాల్ కుట్టి ఇచ్చేస్తుంది, మేచింగ్ కి కాంట్రాస్ట్ బ్లౌజ్  లు ఉండనే ఉన్నాయి. ఇక ప్రోబ్లమే లేదు. ఓహ్ కొత్త చీర కట్టుకొని వెళితే అందరి చూపులు తన వైపే ఉంటాయి వావ్, గ్రేట్ అని పొగుడుతారు  అప్పుడు భలే థ్రిల్లింగ్ గా ఉంటుంది అని ఆ దృశ్యాన్ని ఊహించుకుంటూ మురిసిపోయింది.                                                                                                                
ఇంత బ్యూటిఫుల్ ఐడియా  ఇచ్చినందుకు కూతురిబుగ్గ మీద ముద్దు పెట్టి   థాంక్స్ చెప్పి, గబా గబా తయారయింది.
“అబ్బ  ఏంటి మమ్మీ, ఇదంతా కొత్త చీర కోసమే” అంటూ ఉడికించింది.
చైతాలీ మటుకు  కూతురి మాటలు పట్టించు కూకుండా ఊహాలోకం లో విహరిస్తోంది   
పొద్దుటనుంచి భార్య హడావుడి గమనిస్తున్న. రాకేశ్.“ఏంటి చైతూ డియర్  మీ సీమ ఏదైనా లంచ్ పార్టీ ఇస్తోందా ఏదో చీరలు,కలర్ అంటూ తెగ హడావుడి పడుతున్నావు,”.                                                                                                                     “అబ్బ ఏమి తెలీనట్లు, పొద్దున్నే సీమ ఫోన్ చేయడం,లంచ్ గురుంచి చెప్పడం, మా డ్రెస్ కోడ్ గురుంచి మాట్లాడుకోవటం అన్ని విని, తీరికగా ఏంటి సంగతి అని అంటున్నారు, అది సరే నాకు ఈ బట్టల ల షాప్ లు కరెక్ట గా ఎన్నింటికి తీస్తారో  చెప్పండీ ” అని అంది.
“దానికంత ఆలోచన ఎందుకు, పదిగంటలకల్లా వెళ్ళిపో”  అని అన్నాడు.
“సరే ‘అంటూ , కిచెన్ లో  ఉన్న శోభ తో “పది గంటల కి బజారు వెళ్లి చీర తెచ్చుకొని వస్తాను. నువ్వు వెంటనే ఫాల్ కుట్టి ఇచ్చెయ్యి. ఈ లోపల నీ పని అంతా పూర్తీ చేసుకో’ అని చెప్పింది
“సరే మేడం,మీరు తెచ్చి ఇవ్వండి.  పావు గంటలో కుట్టి ఇచ్చేస్తాను”.అంది శోభ.
తొమ్మిది గంటలకి  బ్రేక్ ఫాస్ట్ చేసేసి.సోఫాలో కూర్చొని మెసేజ్ లు చూసుకుంటూ టీవీ  చానల్స్ తిప్పుతూ. మాటిమాటికి టైం చూసుకుంటోంది . అప్పటికే రాకేశ్,  తూలిక, ఇద్దరూ ఆఫీసుకి,కాలేజీ కి వెళ్ళిపోయారు
                                                                 **
రాజయ్య చెప్పులు వేసుకుంటూ “షాప్ కాడ  దింపుతావా బిడ్డా” అని కొడుకుని అడిగాడు .                                      “ఆ! నే దింపుతాలే” అన్నాడు మల్లేష్. వెంటనే లోపలనుండి కోడలు “ఇంకా ఈ ముసలోడికి పైసలు సంపాదించాలని తాపత్రయం ఎందుకో, ఇంట్లో ఉండరాదా, ఈ వయసులో కూడా  పనికి పోతున్నాడని బస్తీలో అందరూ చెవులు కొరుక్కుకుంటున్నారు” అని విసుక్కుంటూ టిఫిన్ డబ్బా తెచ్చి ఠప్పున కింద పెట్టింది.
రాజయ్య ఆ మాటలు పట్టించుకోకుండా కిందకి వంగి  టిఫిన్ డబ్బా తీసుకొని,బాగ్ లో పెట్టుకొని,చెప్పులు వేసుకొని బయటకు వచ్చాడు. కొడుకు మొహం  అభావంగా ఉంది. తన చేతి లోని బాగ్ అందుకొని ముందు ఉన్న బాక్స్ లో పెట్టి స్కూటర్ స్టార్ట్ చెయ్యిగానే ,రాజయ్య కొడుకు భుజం మీద చేతులేసి ఎక్కి కూర్చొన్నాడు.
అప్పటికే తొమ్మిది గంటలు అయిందేమో,రోడ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. అందరికి తొందరే! ఎవరికి వాళ్ళే  ముందు వెళ్ళిపోవాలని. ఆ క్రమం లో ఒకటే హారను మోతలు.అంత రొదలో కూడా రాజయ్య ధ్యాస అంతా తను చెయ్యాలిసిన పని మీదే ఉంది.
అందరూ రావడం మొదలుపెడితే తను వాళ్ళ దగ్గరకి వెళ్ళలేడు.వాళ్ళు సరిగ్గా ఉండకపోతే   తనకి ఏదో వెలితిగా ఉంటుంది. అందుకే సాధ్యమైనంత వరకు షాప్ కట్టేసేకా యెంత లేట్ అయినా వాళ్ళ పని చేసేసే వెళతాడు.. 
కానీ  నిన్న రాత్రి ఆ కుర్రాళ్ళ గొడవలో  పడి సరిగ్గా చెయ్యలేదేమో అనే అనుమానం గ ఉంది. అందుకే కొడుకుని త్వరగా  దింపమని అడిగాడు. ఇదిగో ఈ దిక్కుమాలిన ట్రాఫిక్ లో ఆలస్యం అయిపోతుంది. ఈ పెద్దతనం మూలాన అస్తమాను సైకిల్ తొక్కలేకపోతున్నాడు.   కొడుకే షాప్ కాడ బండి మీద దింపుతున్నాడు . వయసు పెరిగే కొద్దీ రాత్రిళ్ళునిద్ర పట్టటం లేదు. ఉదయాన్నే లేవడానికి కాళ్ళు, చేతులు సాగవు.అయినా ఎలాగో తంటాలు పడి బతుకు నెట్టుకొస్తున్నా కోడలి రుసరుసలు తప్పటం లేదు.  పోనీ పని మానేసి ఇంట్లో కూచుందాంమని అనుకున్నా, అలవాటు పడిన ప్రాణం ,పని చెయ్యకపోతే తోచదు, హుషారు ఉండదు. అందులో సాయమ్మ పోయినకాడి నుండి బతుకంటే మరీ విరక్తి వచ్చేసింది అందుకే ఎక్కువగ షాప్ లోనే గడుపుతున్నాడు. అయినా కోడలి కెందుకో తన ఉనికే పడదు ఏదో ఒకటి సాధిస్తూనే ఉంటుంది”అనుకుంటూ ఆలోచనలలో పడిపోయిన  రాజయ్య.
“నాయినా! షాప్ వచ్చింది,దిగు” అన్న కొడుకు మాటలతో ఉలిక్కిపడి బండి దిగాడు. చేతికి టిఫిన్ ఇస్తూ “రాత్రి నేను వచ్చి తీస్క పోతా,నువ్వు కంగారు పడి  నిన్నట్లా బస్సులో రావద్దు.సరేనా” అని హెచ్చరించాడు. ‘సరే’ అని తలూపి నెమ్మదిగా షాప్ మెట్లు ఎక్కాడు.
                                                                      **
తొమ్మిదిన్నర  కాగానే చైతాలీ కారు తీసుకొని  సిటీ లో బట్టలు షాప్స్ ఎక్కువగా ఉండే  చోటుకి బయలుదేరింది. 
అది కరెక్ట్  గా ఆఫీస్ టైం కావడం తో రద్దీ  బానే ఉంది. అన్ని సిగ్నల్స్ దాటుకుంటూ వెళ్లేసరికి 
పది గంటలయింది.  కారుని పార్కింగ్  ప్లేస్ లో పార్క్ చేసి, వరుసగా ఉన్న షాప్ ల వైపు నడిచింది. మొదట షాప్ లోకి వెళ్లి తనకు కావలిసిన  కలర్ లో చీర కావాలని అడిగింది .ఆ కలర్ లో లేవు అని చెప్పారు ఆ షాప్ లో వాళ్ళు అక్కడ నుండి ఇంకోటి, ఇంకోటి  అలా వరుసగా అర డజన్ షాప్ ల మెట్లు ఎక్కుతూ దిగుతూ,వెతికింది. అప్పటికే లోలోపల చిరాకు మొదలయింది. అయినా ఓపిక పట్టి  కొంచెము ముందుకు వెళ్లి సిటీ లో బోలెడు బ్రాంచ్ లు ఉండే ఒక పెద్ద షాప్ కి వెళ్ళింది. మెట్లెక్కి వెళుతుండగా ఎడం పక్కకి  వరుసగా ఉన్న బొమ్మలకి అందంగా చీరలు కట్టి ఉన్నాయి. లోపలి కాలు పెడుతుండగానే “రండమ్మా,రండి,సారీస్ కావాలా,డ్రెస్ మెటీరియల్ కావాలా?అని మొత్తం  లిస్టు ఏకరవు పెడుతున్నాడు. ఒకతను. బహుశా అక్కడ ఉండే మేనేజర్ కాబోలు.
‘చైతాలీ అతని మాటలు వింటూ ముందుకు నడుస్తున్నదల్లా, ఒక్కసారి  ఆగిపోయింది. సంభ్రంగా చూస్తూ నిలబడిపోయింది. అక్కడ షాపు మధ్యలో  అందంగా చక్కని హెయిర్ స్టయిల్‌తో మిలమిలలాడుతూ ఓ అందమైన మేనిక్విన్ కి  కట్టిన లెమన్ యెల్లో కలర్ చీర కనిపించింది. వెంటనే దగ్గరకు వెళ్లి చీరను పట్టుకొని  చూసింది. అది మెత్తటి షిఫాన్ జార్జెట్, మోకాలి వరకు లేతాకుపచ్చ కొమ్మలతో ఉండి చీర అంచులకి బేబీ పింక్ లేసుతో  ఉన్న ఆ చీర మనసుని దోచేసుకుంది. ఆ చీర ఖరీదు చూసింది పదివేలు. వెంటనే ఆ చీరని ప్యాక్ చేసి ఇమ్మని అడిగింది. అప్పటికే   టైం పదిన్నర అయింది. తను ఎట్ లీస్ట్ ఒంటిగంట కైనా అక్కడ ఉండాలి’ అనుకుంది.. ‘’ప్చ్ ఒక్కో సారి ఒంటరిగా షాపింగ్ చెయ్యడం బోర్ గా ఉంటుంది. ఎవరైనా కంపెనీఉంటె  ఇంకా బావుండేది అని గాఢం గా నిట్టూర్చింది. కళ్ళనిండా చీరను చూస్తూ తెగ సంబరపడుతోంది. చీరకు ఫోటోలు తీసి కూతురికి వాట్సప్ మెసేజ్ లో పంపింది. వెంటనే awesome మమ్మీ అంటూ రిప్లై ఇచ్చింది తూలిక.
పక్కనుంచి “ మేడం ఒక్క పది నిముషాలు ఓపిక పట్టండి అన్నాడు” ఆ మేనేజర్. 
పది నిముషాలు తరువాత వచ్చి “ఇది శాంపిల్ చీర,  ఒక్కటే ఉంది. ఇప్పుడు వెంటనే ఇవ్వడానికి కుదరదు . మీరు సాయంత్రం కాని  రేపు కాని వచ్చి తీసుకోండి” అన్నాడు అని చావు కబురు చల్లగా చెప్పాడు 
“అయ్యో ఆ చీర నాకు చాల అర్జెంట్  గా కావాలి నేను ఊరు వెళ్ళిపోతున్నాను”.  అయినా కస్టమర్ అడిగిన వెంటనే ఇవ్వాలి గాని  ఎప్పుడో ఇస్తానంటే ఎలా ? అని గట్టిగా అడిగింది.
ఏమనుకున్నాడో  మేనేజర్ పొద్దున్నే  వచ్చిన కస్టమర్ ని వట్టి చేతులతో పంపడం సెంటిమెంట్  గా ఫీల్ అయినట్లున్నాడు. “మేడం మీరు కొంచెం సేపు వెయిట్ చెయ్య గలరా?  ఎందుకంటె ఆ బొమ్మకు వేరే చీర కట్టాలి,అసలు అసలు షాప్ లో ఉండే బొమ్మలకి రాత్రే చేంజ్  చేస్తారు. ఇప్పుడు మీరు బొమ్మకి కట్టినది అడుగుతున్నారు కాబట్టి చీర కట్టే అతను వచ్చాక  కాని ఇవ్వలేను అని చెప్పాడు.
“సరే  తొందరగా మార్చండి” అని అంది
కౌంటర్ దగ్గరకు వెళ్లి బిల్ కూడా పే చేసేసింది. ఆల్రెడీ  డిస్ ప్లే లో ఉన్న చీరే కాబట్టి చెక్ చెయ్యక్కర్లేదు. అనుకుంది
“అరె రాజయ్య వచ్చాడా ఎక్కడ ఉన్నాడు? అతన్ని పిలుచుకు రా”  అని అక్కడున్న అబ్బాయి తో అన్నాడు. మేనేజర్. సమాధానంగా ఆ   అబ్బాయి ఆ “పొద్దుగాలనే వచ్చిండు” అని చెబుతూ అతన్ని పిలవడానికి వెళ్ళాడు. అంతలోనే  గిర్రున తిరిగి వచ్చి రాజయ్య “చాయ్ తాగడానికి పోయిండు “అని చెప్పాడు. “ సరే తొందరగా రమ్మనమను” అని చెప్పి మేనేజర్  కౌంటర్ పక్కకి వెళ్ళిపోయాడు. 
ఇదంతా కొంచెం దూరం లో ఉన్న ఇద్దరు సేల్స్ గర్ల్స్  చూస్తున్నారు. అందులో ఒకమ్మాయి ‘ఎనిమిది’ అంది. ‘అంటే’ అంది రెండో అమ్మాయి. “ఏం లేదు ఇప్పటికి  నేను వచ్చాకా ఇలా డిసప్లే చీర మార్చడం ఎనిమిదో సారి. అందు లో రాజయ్య కట్టిన చీరకే అంత డిమాండ్.బొమ్మల కు చీర మార్చేటప్పుడు  తప్పకుండా ఒక లేడీ స్టాఫ్ ని ఉండమంటారు. అందులో రాజయ్య చీరలు కట్టే బొమ్మలకి మరీ తప్పనిసరిగా ఉండాలి. ఒక విషయం తెలుసా బొమ్మకి చీర మార్చేటప్పుడు మొత్తం తీయకుండా  భలే చాక చక్యంగా కడతాడు, పై బట్ట ఏది లేకుండా బొమ్మని డైరెక్ట్ గ తను ముట్టుకోడు. ఎవరినీ ముట్టుకోనివ్వడు ‘బొమ్మే కదా రాజయ్య అంటే’ ‘అన్నం పెట్టే ది ఈ పనే కదమ్మా ! తల్లి తో సమానం కదా ! ముట్టుకోవడం పాపం! అని  ఏదేదో చెప్పాడు.’ నాకు ఒక్కటే అర్దమయింది. తను పని ని ఏంతో భక్తిగా, శ్రద్ధగా చేస్తాడు పసి పిల్ల లో కూడా ఆడతనం చూసే వాళ్ళున్న ఈ దౌర్భాగ్యపు కాలం లో ఒక  బొమ్మని గౌరవం గ చూడాలనుకోవడం అంటే చాల గొప్ప విషయం కదా. అదిగాక  ఈ షాపు లో అందరికీ తెలుసు అతని సంగతి. అందుకే అందరూ కూడా  ఇక్కడ ఉండే మేనిక్విన్స్ ని చాల గౌరవంగా  చూస్తారు.దానికి కారణం రాజయ్యే.” అంది మొదటి అమ్మాయి 
“మరి  నిన్న రాత్రిఅంత  పెద్ద గొడవ ఎలా జరిగింది, పొప్రయిటర్ వరకు వెళ్ళిందట ఇందాక మేనేజెర్ అంటుంటే విన్నాను. అంది రెండో అమ్మాయి
“అదే చెబుతున్నా  ఎప్పటిలాగే నిన్న రాత్రి  బొమ్మకి చీర కడుతుండగా, కొత్తగా వచ్చిన  కుర్రాళ్ళు ఆ బొమ్మని ముట్టుకోవడం, ఏదో పిచ్చి కూతలు కూయడం, ప్రైవేట్ పార్ట్స్  మీద చేతులు వేయడం జరిగింది. ఇదంతా చూస్తున్న రాజయ్య సహించలేక వాళ్ళని బాగా తిట్టాడు ఆల్మోస్ట్  కొట్టినంత పని చేసాడు.నిన్న నువ్వు తొందరగా వెళ్ళిపోవడం తో నాతొ పాటు గ సునీత ఉంది అక్కడ.
‘ఆ బొమ్మేమన్నా నిజం మనిషా,ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు ముసలాడా” అని  వాళ్ళు హేళన చేసారు.దానితో రాజయ్యకూడా రెచ్చిపోయాడు. ఆ క్షణం లో భయమేసింది మాకు ఆ కుర్రాళ్ళు  రాజయ్యని కొట్టేస్తారేమో అని ఎలాగో మొత్తానికి సద్ది చెప్పి పంపించేశాము. అయితే సెక్యూరిటీ గార్డ్ పొప్రయిటర్ గారెకి చెప్పాడుట ఇక్కడ జరిగిన సంగతి  అని ఇంకా ఏదో మాట్లాడబోతున్నదల్లా కోపంగా వీళ్ళ వైపే చూస్తున్న మేనేజర్ ని గమనించి ఆపేసింది.
ఇంకా షాప్ లోకి  జనాలు ఎవ్వరూ రాలేదు. కొనే వాళ్ళకన్నా  స్టాఫ్ ఎక్కువగా కనిపిస్తున్నారుఅనుకుంది. అక్కడే సోఫా లో కూర్చొన్న చైతాలీ.
పదిహేను  నిముషాలు బరువుగా గడిచాక ఆ సదరు  రాజయ్య చ్చాడు. అతన్ని చూస్తూనే మేనేజర్ “రాజయ్యా,బొమ్మకికట్టిన  చీర కస్టమర్ కి ఇవ్వాలి. అందుకని అది మార్చి ఈ చీర కట్టు” అంటూ అతని చేతికిచ్చాడు.
‘అది చూసి అమ్మయ్య  ఇంక చీర చేతికి వచ్చేస్తుంది అన్న సంతోషం లో చైతాలీ  మేనిక్విన్.వైపు చూస్తూ సరదాగా అనుకుంది చక్కగా బొమ్మలా చీర కట్టుకుని కూర్చొంది అంటే ఇదేనేమో.  ఎంత బావుందో అచ్చు నిజంగా ఒక అందమైన అమ్మాయి నించొంన్నుట్లుగా ఉంది. చీరని భలే కట్టాడు ముసలాడైనా , చాలా ఏళ్ళనుండి  ఈ షాప్ లోనే పని చేస్తున్నాడుట. బొమ్మలకి చీర కట్టడంలో అతనికి ఉన్న నైపుణ్యం ఇంకెవరికీ లేదని ఇందాక ఆ మేనేజర్ అన్నాడు కూడ,  అరె తను వెళ్ళాలి అని చప్పున టైం చూసుకుంటూ ‘ అయ్యో!అప్పుడే పదకొండున్నర అవుతోంది,ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి,ఎప్పుడు ఫాల్ కుట్టించుకోవాలి  ఛ ఛ ఇంత లేట్ చేస్తారనుకోలేదు’ అనుకుంటూ బొమ్మ వైపు చూసేసరికి, అతను ఇంకా చీర మార్చనే లేదు. నిదానంగా వంగొని తీరికగా బొమ్మ పాదాల దగ్గర ఏదో సరి చేస్తున్నాడు.’
ఇంతసేపు అతని గురుంచి ఏంతోగొప్పగా తలచుకుంటుంటే  ఈ ముసలాడు ఒక్క సారిగా తన సంతోషాన్ని ఆవిరి చేసేసాడు.అని  చైతాలీకి ఒళ్ళు మండిపోయింది.
“ ఏయి ఏంటి ఇంత సేపు,అవతల నాకు టైం అవుతోంది అని చెప్పాను కదా!”  అని గట్టిగా అరిచింది
ఆ అరుపుకి మేనేజెర్ పరిగెత్తుకొని వచ్చి ‘ప్లీజ్  మేడం,నేను అతనికి తొందరగా ఇయ్యమని చెబుతాను’అని బతిమలాడి, రాజయ్య దగ్గరకు వెళ్ళాడు. అతను ఏదో తల అడ్డంగా ఊపుతున్నాడు. పాపం ఈ మేనేజెర్  పరిస్థితి అడకత్తెరలో చందమయింది. వెంటనే సేల్స్ కౌంటర్ లో అమ్మాయికి చూపులతోనే అక్కడకి వెళ్లి సాయం చెయ్యమని చెప్పాడు
ఆ అమ్మాయి చిన్న గ నవ్వుకుంటూ  రాజయ్య నించొని ఉన్న బొమ్మ దగ్గరకు వెళ్ళింది. అతను  బొమ్మ వైపు వీపు పెట్టి నించొని ఉన్నాడు. బొమ్మకు కట్టబోయే ఇంకో చీర కుచ్చిళ్ళుపోసి పట్టుకొని ఉన్నాడు. ఆ అమ్మాయి అప్పటికే వచ్చి బొమ్మకు కట్టిన చీరకు ఉన్న  పిన్స్ తీసేసింది. ఆమె చేతిలో ఒక తెల్లటి బట్ట ఉంది. ఇక ఎడం చేత్తో ఆ చీర తీసి కుడి చేత్తో ఆ ఆ తెల్లటి బట్ట చుట్టే లోపల, 
చైతాలీ విసురుగా నడుచుకుంటూ   మేనిక్విన్ దగ్గరగా వెళ్లి నిదానంగా తీస్తున్న ఆ అమ్మాయి  చేతుల్లోంచి చీరని గభాల్న లాగేసింది. అకస్మాత్తుగా జరిగిన ఆ చర్యకి  ఆ అమ్మాయి “ఆ” అని కొయ్య బారిపోయింది.
ఆ అరుపుకి ఆ వైపుకి చూసిన చైతాలీ చేతులలోంచి అప్రయత్నంగా చీర జారి కింద పడిపోయింది. అక్కడ కౌంటర్లు ముందున్న వాళ్ళు దిగ్భ్రాంతికి లోనయ్యారు 

అనుకోకుండా జరిగిన ఆ  సంఘటనకు రాజయ్య చలించిపోయి  చేతి లో ఉన్న చీరను బొమ్మ మీద నిట్టనిలువుగా  కప్పెసాడు

అక్కడే నుంచొని ఉన్న  ఆ సేల్స్ అమ్మాయి ఒక్క ఉదుటులో బొమ్మ దగ్గరకు  వెళ్లి దాన్ని సరి చేసే ప్రయత్నం లో ఉంది.

కొద్ది క్షణాల నిశబ్దం  తరువాత రాజయ్య, కింద పడిన చీరని  తీసి చైతాలీ కి ఇస్తూ “ ఇది ప్రాణం లేని  బొమ్మే అయినా నీలాంటి దే కదమ్మా, ఆడతనాన్ని నడి మధ్యలో నగ్నంగా ఉంచొచ్చునా? ” అని మాత్రం  అన్నాడు 

ఆ మాటలకి  సిగ్గుపడిపోయింది చైతాలీ. అవమానం భారం తో  కళ్ళ నీళ్ళు తిరిగి నోట మాట రాక  చేష్టలు  దక్కి ప్రాణం ఉన్న  బొమ్మ లా ఉండిపోయింది.


                                               (సమాప్తం)

madhuravani.com లో మొదటి బహుమతి పొందిన కధ
చాలా రోజులు తరువాత    మళ్ళి నా బ్లాగ్   తెరిచాను.

వచ్చేవారం  నుండి  ప్రయాణం  ధారావాహిక  ప్రారంభం అవుతోంది.

Wednesday, December 20, 2017


ధారావాహిక  రెండవ భాగం

ఉదయం తొమ్మిదిన్నర గంటలు. ఒకటో నంబరు ప్లాట్‌ ఫారం మీదకి కాశీ వెళ్ళే రైలు వస్తున్నట్లుగా రైల్వేస్టేషన్‌ వారి అనౌ...
JAGRITIWEEKLY.COM