ఆకునూరి హాసన్
గేటు తీసుకుని భేతాళుని శవంలా భుజాల నుంచి గుండెల వరకూ పట్టి వదలని ఆలోచనల్ని మోసుకుంటూ, లోపలికి వెళ్ళి వరండాలోని ప్లాస్టిక్ కుర్చీలో కూర్చొని పైకి చూస్తే, నిలువుగా టేకు దూలాలు, పై నుంచి వేలాడే లైట్, ఫ్యాన్. అక్కడే ఉన్న తెలుగుపేపర్ తీసుకుని పేజీలు తిప్పుతుంటే - లోపల్నుంచి బయటకు అడుగుల చప్పుడు. ముతక నేత చీరలో వయోభారంతో వంగిన పెద్దావిడ బయటకు వచ్చింది. కుర్చీలో సరిగా కూర్చుని, రోజులాగే నవ్వి పొగలు కక్కే ఫిల్టర్ కాఫీ గ్లాస్ అందుకున్నాక -
"ఫోన్ చేశాడా? మెసేజ్ ఏమన్నా పెట్టాడా'' అడిగిన ఆ పెద్దావిడకి -
"లేదమ్మా. ఈ రోజు మెసేజ్, మెయిల్ పంపుతా. ఎవరైనా వచ్చారా?'' అని అడిగితే పెదాలు చిన్నగా విరిచిన ఆమె ... ఎక్కడికో జీవితపు తలుపులు తెరుచుకుని, చీకట్లోకి అడుగు పెడుతున్నట్లుగా ఓ సారి వీధివైపు చూసి, అక్కడే చూపులు ఆపింది. ఆమె ఒక్కగానొక్క కొడుకు - నలభై ఏళ్ళ మహర్షి రెండేళ్ళ కిందట ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఎప్పటికప్పుడు 'వచ్చేనెలలో వచ్చేస్తున్నాను' అంటూ చెబుతూ నెలలు గడుపుతుంటే, ఇన్నాళ్ళు ఆవిడా, నేనూ ఎదురుచూడ్డంలో గడిపేశాం. ఇంటిని 'కబళిద్దామని' చూస్తూ ఇంటి చుట్టూ తిరిగే అప్పులవాళ్ళు ... ఒంటరిగా ఆవిడా.
వేడి కాఫీ నాలుక మీద చురుక్కుమంది. జ్ఞాపకాల్లా అనుభవాల్లా జీవితంలా వగరుగా తగిలింది.
కొడుకు గురించి ఏమైనా చెబుతానని మరికొన్ని క్షణాలు నిలబడిన ఆవిడ కాసేపటికి దిగులుగా దేన్నో వెతుకుతున్నట్లుగా, జారిపోయే గాజుపురుగులా పొడవాటి ఇంట్లోకి ... గుమ్మాలు దాటుకుంటూ వెళ్ళిపోయింది.
పేపర్లోని వార్తల్ని కాఫీతో కలిపి చప్పరిస్తూ రెండూ ముగించాక మళ్లీ కళ ్ళ లోయల్లో, గుండె లోపల ఎక్కడో, ఏవో తలుపులు తెరుచుకున్నాయి. లోపలి చీకట్లోకి ... ఏదో పరిమళం ఊపిరికి తగుల్తుంటే, ఏ చివరి గదిలోనో, తెరిచీ తెరవని కిటికీ తలుపుల్ని, తెరిచే ప్రయత్నం చేస్తూ ఏవో నాజూకు చేతులు, మెరిసే వేలికొసలు, నక్షత్రాల్లా కళ్ళు, ఎర్రని పెదాలు ... చల్లని స్పర్శ ... కాంచన !
నవ్వే కళ్ళు, నవ్వని పెదాలు "ప్లీజ్, నాకోసం ఏమైనా చేయవూ'' గుండెలోకి నీళ్ళు నిండిన కళ్ళని, చూపుల్ని గుచ్చి అడిగే అందమైన అమ్మాయికోసం ఎందుకివ్వలేం ... ప్రాణాలైనా సులువుగా?
ఖాళీ అయిన కాఫీ గ్లాసుని నేలమీద పెట్టి ఆలోచనల్లోంచి బయటకి, ఇంట్లోంచి బయటకి వచ్చేస్తే ... ఇందాక తెరుచుకున్న ఏదో తలుపులోంచి మళ్లీ చీకట్లోకి జారుకుని మాయమైన జ్ఞాపకాలూ, రూపాలూ ...
మూడురోడ్ల కూడలి. అటూ ఇటూ వెళ్తూ మనుషులూ, వాహనాలు. ఎటు వెళ్లేది? క్షణంలో వందో వంతు డైలమా. అయినా యధాలాపంగా మళ్ళీ ముందుకే. ఆటోలు, మనుషులు. అప్పుడప్పుడూ నవ్వే, విష్ చేసే ఎన్నో ముఖాలూ ... మళ్ళీ చౌరస్తా. అక్కడ కేవలం జ్ఞాపకంగా మిగిలిన క్లాక్‌టవర్‌లా, కుప్పకూలిన ఆలయగోపురంలా కంటికి కనిపించకుండా రెండు ప్రశ్నలు. రెండు రూపాలు. ఇద్దరు మనుషులు. రెండు వేర్వేరు జీవితాలు. అనుభవాలు, జ్ఞాపకాలు, విషాదాలు. ఒకవైపు మహర్షి అనే మిత్రుడు. మరోవైపు కాంచన అనే ప్రియురాలు. రెండువైపులా రెండుదారులు. ఎదురుగా విశాలమైన రాజవీధి. ఎటువైపు వెళ్తే ఇద్దరిలో ఒకరైనా కనిపిస్తారు? ఎవరు హేండ్ ఇస్తారు? ఎవరు చెయ్యి అందుకుంటారు?
దాదాపు రెండేళ్ళ కిందట మాయమైన ఇద్దరు ... ఒకరు కరెన్సీ కట్టలు తీసుకెళ్తే, మరొకరు ఏ విలువ లేని హృదయాన్ని తీసుకెళ్ళిపోయారు. "నేను నాకు రావాల్సిన డబ్బుల్తో వస్తాను. నీకు ఇవ్వాల్సింది ఇస్తాను. అప్పటిదాకా, అమ్మనీ, ఇంటినీ జాగ్రత్తగా చూసుకో'' అని ఒకరు. "నన్ను మర్చిపోకు. వదిలిపెట్టకు. నీ దగ్గరకి వచ్చేంతవరకూ అక్కడే ఎదురుచూస్తుండు'' అని మరొకరు. విడి విడిగా వేరువేరు సందర్భాల్లో మాట తీసుకున్న వాళ్ళిద్దరూ ఎప్పుడొస్తారు? ఏ దారిలో వెళ్తే దొరుకుతారు?
అనుకున్నవన్నీ, ఆశపడినవన్నీ అలాగే జరుగుతాయా?
జనంలో ఉన్నా ఒంటరిగా వెళ్తున్నట్లే ఉంది. అన్నిటినీ, అందరినీ దాటుకుని ముందుకు నడుస్తూ ఆఫీస్‌కి చేరి ... ఏదో పుస్తకంలో లీనమై, తలుపులోంచి బయటకి ... వేపచెట్టునీ, ఆకుల్ని గలగల మనిపించే రావిచెట్టునీ, కొమ్మల ఆకుల మధ్యనించి కనిపించే చిన్న చిన్న నీలపు అద్దం ముక్కల్లాంటి ఆకాశాన్ని చూస్తుంటే మిలమిలలాడే ఎండలోంచి లోపలికి అడుగుపెట్టాడు యుగంధర్ "వాట్ మిస్టర్, ఏంటి విశేషాలు'' అంటూ. ఆయనొక టీవీ చానల్లో ఎడిటర్.
పుస్తకంలోంచి బయటపడి, నవ్వి "ఈ రోజు ఎం డా, చల్లగాలీ .... పాత జ్ఞాపకాల్ని నిదురలేపుతూ, కొత్త అనుభవాల్ని ముడుచుకునేలా చేస్తున్నాయ్'' అన్నాను.
"సినిక్‌లా మాట్లాడకు. పనేమీ లేకపోతే అలా సముద్రం వరకూ వెళ్దాం. హండ్రెడ్ పైపర్స్ ఊదుకుందాం పద'' అన్నాడు యుగంధర్. అతని మాటల్తో లోపలేదో కదిలి, ఆఫీసు లాక్ చేసి, బజార్లు, జంక్షన్లు దాటుకుని నల్లత్రాచులాంటి తారురోడ్డుమీద జర్రున ప్రయాణం - బైక్ మీద. రోడ్డుకు రెండు వైపులా చెట్లు. వంతెన దాటాక పొడవుగా అనకొండలాగా సింగిల్ రోడ్.
ఫారెస్ట్ హేచరీ, నేరేడుచెట్లు, చిక్కటిఅడవిలాంటి జీడి తోటలూ, సర్వి తోపులూ, ఒళ్లు కాలాక పొడలుగా ఊడే బెరడులాంటి చర్మంలా యూకలిప్టస్ చెట్లు ... ఆ తర్వాత విశాలమైన ఇసుక మైదానంలాంటి పర్ర, చప్టా ... అదీ దాటాక ఎత్తుగా చెలియలి కట్ట ... వెనకనుంచి అలల హోరుతో రమ్మంటున్న సముద్రఘోష. చెవుల్లో, గుండె గదుల్లో, సుడిగాలిలాంటి జ్ఞాపకాలు. మళ్ళీ లోపలెక్కడో తెరుచుకుంటున్న తలుపులు. ఏదో గదిలోకి చిటికెన వేలు పట్టుకుని తీసుకెళ్తున్నట్లుగా బాల్యంలోనో ... యవ్వనంలోనో ... మధ్య వయసులోనో ... ఏదో రూపం ... రెండు కళ్ళు ... హృదయం రంపంతో మెత్తగా కోస్తున్నట్లుగా ... శబ్దమే నిశ్శబ్దంలా మారిపోతూ.. సముద్రతీరంలోని గెస్ట్‌హౌస్ మేడమీద వరండాలో.. జేమ్స్‌తో నీళ్ళూ, సోడా, గ్లాసులూ తెప్పించాక .. ఎదురుగా, అలలూ ... పడవలూ కనిపిస్తుంటే ... హండ్రెడ్స్ పైపర్స్‌ని ఫిక్స్ చేసుకుని చప్పున గ్లాసెత్తి లాగించాక చూస్తే ... నీలాకాశం సముద్రపు నీళ్ళ మీద అలా వచ్చి ఆనుకుని వాలిపోయి అతుక్కున్నట్లుగా సముద్రపు నీళ్ళు ... నీలంగా ... ఆకాశంలాగా ..
"అది కాదు బాస్, ఎన్నాళ్ళు ఎదురు చూస్తావ్? మహర్షి ఏమయ్యాడు! ఎప్పటికి వస్తాడు?'' అడిగాడు యుగంధర్.
"వస్తాడు ... తప్పకుండా'' చెప్తున్న నా గొంతులో ఏదో అడ్డుపడుతోంది.
"లేకపోతే డ్రామా ఆడుతున్నాడేమో! నీకే చాలా ఇవ్వాలి కదా. బయటనుంచి కూడా ఎంతో తెచ్చి ఇచ్చావు. ఎన్నాళ్ళు ఎదురుచూస్తావు. నువ్వు తప్ప అతడ్ని ఎవరూ నమ్మడం లేదు'' అన్నాడు.
నమ్మడం మాత్రమే తెలియడం ... నిజంగా నా తప్పేనా? స్నేహితుల్ని, ప్రేమించిన వాళ్ళని కాక మరెవరిని నమ్మాలి?
జీవితం ముందు నిలబడి ఏదైనా అడిగితే, ఏమీ ఆలోచించకుండా చేసుకుపోవడం, గుండె తలుపులు తట్టి అడిగితే హృదయం, జీవితం, సమస్తం ఇచ్చేసి శూన్యంగా మిగిలిపోవడం ... నేనే ఎందుకిలా? నాకే ఎందుకిలా? నాలా లోకంలో ఎవరూ కనిపించరేం?
"అవునూ ... తను ఏమైంది బాస్! ఎక్కడుంది? ఏమైనా సమాచారం తెలుస్తోందా?'' అడిగాడు యుగంధర్.
ఇప్పుడు అతను అడుగుతోంది కాంచన గురించి. ఏం చెప్పాలి? ఏం తెలుసని? తను స్వేచ్ఛలోంచి బందిఖానాలోకి, అమ్మ, అక్కలు పన్నిన, అల్లిన ముళ్ళకంచెలోకి వెళ్ళిపోయే చివరి ప్రయాణంలో ఇచ్చిన ఎస్సెమ్మెస్ గుర్తొచ్చింది.
"కాల్ మీ వన్స్. ఇక ఎలాగూ నేను నో మోర్ టుబి. కనీసం నీ గొంతైనా చివరిసారి వింటాను'' అంటూ ఆ రాత్రి .. వెంటనే కాల్ చేస్తే ... కాంచన మాట్లాడిన నాలుగైదు చివరి మాటలు, అంతే ... ఇరవై నెలలు. ఏమీ తెలీదు. ఎలా ఉంది? అరె ... తెరుచుకోకపోయినా ... ఎందుకు తెరుస్తావురా ... ఏవో గదుల తలుపుల్ని ... యూ ... రాస్కెల్.
ఇంతలో ఉన్నట్టుండి ... ఏడవడం మొదలుపెట్టాడు యుగంధర్. నా లోపల ఓరగా తెరుచుకున్న తలుపులు చీకట్లోకి మూసుకుపోయాయి. ముందుకి వంగి అతని భుజం మీద చెయ్యేసి "అరె, ఏమయింది ఊరుకో ... ఊరుకో ...'' అని సర్దిచెప్పాలని చూశాను. "లేదు బాస్, తను బాగా గుర్తొస్తోంది. మానసికంగా ఒకరిని ఒకరు అర్థం చేసుకుని, అడ్జస్ట్ అయ్యే టైములో ఎందుకు జరిగింది ఇలా? నన్ను, నా కొడుకుని ఒంటరిగా చేసి వెళ్ళిపోయింది. ఎందుకో ఈ మధ్య కళ్ళముందు కనిపిస్తున్నట్టుగానే అనిపిస్తోంది. తను చనిపోలేదేమో?'' చొక్కాతో కళ్ళు తుడుచుకున్నాడు.
అతని భార్య ఈ మధ్యే చనిపోయింది. అతను హైదరాబాద్‌లో, పదేళ్ళ కొడుకు అమ్మమ్మ దగ్గర ఉన్న సమయంలో .. ఉద్యోగం చేసే ఊళ్లో ... ఒంటరిగా, ఒకానొక రాత్రి అప్పటిదాకా అతనితో ఫోన్‌లో మాట్లాడి 'నిద్రొస్తోంది' అని చెప్పి నిద్రలోనే మరో లోకానికి వెళ్ళిపోయింది ఆమె. అతను ఆ షాక్‌లోంచి బయటకి రాలేదు. అప్పుడప్పుడు ఇలా బరస్ట్ అవుతుంటాడు. మౌనంగా కూర్చుండి పోయాడు యుగంధర్.
దూరంగా చూస్తుంటే నీలాకాశం ... నీలంగా ఉన్న సముద్రం .. ఒక దానితో ఒకటి కలిసినట్లుగా ... స్పష్టంగా కనిపిస్తున్నాయి. అది ఎంత అబద్ధమైనా సరే .. ముమ్మాటికీ నిజంలాగే. కంటికి కనిపించేది నిజం. అయితే ప్రతి నిజమూ సత్యం కాదు. కంటికి కనిపించే వాస్తవం వేరు .. సత్యం వేరు. చాలా సేపటి తర్వాత ఇద్దరి అడుగులూ సముద్రంవైపు సాగాయి.
అలలు ఒకదాని వెంట మరొకటి తీరానికి చేరి విరిగి మళ్ళీ వెనక్కి ... మరొక అల అలాగే. ఇలా నిరంతరం, విసుగు విరామంలేని ఆలోచనల్లా. ఏదో ఒక రోజు మహర్షి తనకి రావాల్సిన డబ్బులతో తిరిగివచ్చి, నా డబ్బులు నాకిచ్చి సమస్యలు తొలిగిస్తాడనీ, అలాగే కాంచన కూడా బందిఖానా నుంచి బయటపడి, మళ్ళీ నా జీవితం ముందు నిలబడి, గుండె తలుపులు తడుతుందని ... ఆ ఆశతోనే ఎక్కడికీ వెళ్ళకుండా ఇలా పగలూ రాత్రీ ప్రతి క్షణం ఇక్కడే ఎదురుచూస్తున్నానని ఎవరికి తెలుసు?
"సముద్రమూ, అలలూ ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. మారేది మనుషులే ... మనసులే'' వెనకనుంచి అంటున్నాడు యుగంధర్. ఇతని భార్య ఈ లోకంలో లేదని, ఇక ఎప్పటికీ బతికి రాదనే సత్యం ఇతనికి తెలుసు. ఆమె ఒకవేళ కనిపించినా .. అది కలో, భ్రమో ... అంతే! కానీ, నాకు అలా కాదు. ఏదో క్షణంలో, ఎక్కడో రోడ్డు దాటుతున్నపుడో, బస్టాండ్‌లోనో, రైల్వే ప్లాట్‌ఫారం మీదో .. ఉదయమో, మధ్యాహ్నమో .. లేక ఏ చీకటి రాత్రివేళో ... మహర్షి గానీ కాంచన గానీ .. లేక ఇద్దరూ .. ఎవరికి వారు కళ్ళముందు, జీవితం ముందు వాస్తవంలా కనిపిస్తారనే ఆశ. మౌనాన్ని, నిరీక్షణని జీవితంగా మార్చుకుని క్షణాలు, గంటలు, రోజులు, నెలలు గడిపే నాకు ... అదే శ్వాస, ధ్యాస.
ఇది నిజంగా సత్యం కావచ్చు .. కాకపోవచ్చు. జరగచ్చు .. అసలు జరగక పోవచ్చు .. కానీ అది ఆప్టిమిజం. ఆఫ్ట్రాల్ అది జీవితం! నాదీ, నీదీ, మనలాంటి అందరిదీ ... అంతే!!
...............................................
రచయిత సెల్: 98494 27699